మహాభారతంలోని రెండు పాత్రలైన కృష్ణుడు, కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది...
కర్ణుడు కృష్ణుడుని అడిగాడు...
నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది..
అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పా..కాదే..
ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు..ఎందుకంటే నేను క్షత్రియుని కాను అన్న కారణంతో..
పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడేవరకూ ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు..
పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు..
ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది..
ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పటం వెనకనున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే..
నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే..
అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని చెప్పాడు కర్ణుడు...
దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణునికి చెప్పాడు...
నేను పుట్టటమే కారాగారంలో పుట్టాను..
నేను పుట్టటం కంటే ముందే నా చావు నాకోసం కాచుకుని కూర్చుంది..
నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లితండ్రి నుండీ వేరుచేయబడ్డాను..
చిన్నతనంలో నువ్వు కత్తులు , రధాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు..
నేను గోశాలలో పేడ వాసనల మధ్యన ఉన్నాను...
నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి..అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు..కానీ ఎన్నో దాడులు ఎదుర్కున్నాను..
నాచుట్టూ ఉన్న వారు వారి సమస్యలకు నేనే కారణం అని నన్ను నిందించేవారు కూడా..
నాకు సైన్యమూ లేదు, విద్య కూడా లేదు..
మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచీ అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడానూ..
సాందీపుని రుషి వద్ద నా పదహారో ఏట నా చదువు ప్రారంభం అయ్యింది..
నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు..
నేను నాకిష్టమైన అమ్మాయిని చేసుకోలేకపోయాను..పైగా నన్ను వివాహం చేసుకున్నవారు..వారు నన్ను కోరుకుని కొందరూ, నేను రాక్షసుల నుండీ కాపాడబడినవారు కొందరూనూ..
జరాసంధుని బారి నుంచీ కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమునవడ్డునుంచీ దూరంగా తీసుకెళ్ళాల్సివచ్చింది..
అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డపేరు నాకొచ్చింది..
సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో నీకు మంచిపేరు వస్తుంది...
అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు...పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకూ నేనే కారణం అన్న నింద వేస్తారు అందరూ నాపైన...
ఒకటి గుర్తుంచుకో కర్ణా..
జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి..
జీవితం ఏ ఒక్కరికీ పూలబాట కాదు..అన్నివేళలా అంతా సవ్యంగానే ఉండదు..
దుర్యోధనుడు అవనీ యుధిష్టరుడు అవనీ అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసినవారే..
ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు..
మనకు ఎంత అన్యాయం జరిగినా..
మనకు ఎన్ని పరాభవాలు జరిగిన..
మనకు రావల్సినది మనకు అందకపోయినా...
మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం...అదే చాలా ముఖ్యమైనది..
జీవితం ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో..అనే కారణాలు మనకు అధర్మమార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా (licence ) అనుకోకూడదు..మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు...ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు..అని కర్ణునికి క్రృష్ణుడు బోధించాడు..