Monday, June 1, 2020

Spiritual Quiz

Spiritual Quiz


1. భగవద్గీతను లిఖించిన దెవరు?
=విఘ్నేశ్వరుడు.

2. భగవద్గీత మహాభారతంలోని 
ఏ పర్వములోని భాగము?
= భీష్మ పర్వము.

3. గీతాజయంతి 
ఏ మాసములో ఎప్పుడు వచ్చును?
=మార్గశిర మాసము.

4. గీతాజయంతి 
ఏ ఋతువులో వచ్చును?
=హేమంత ఋతువు.

5. ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వసంత ఋతువు.

6. భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను?
=శ్రీకృష్ణుడు అర్జునునికి.

7. భగవద్గీత 
ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను?
=కురుక్షేత్ర సంగ్రామము.

8. భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభ మయ్యెను?
=కౌరవ పాండవులకు.

9. పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను?
=అర్జునుడు.

10. వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను?
=సామవేదము.

11. మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?
=పాంచజన్యము.

12. భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు?
=పద్దెనిమిది (18)

13. “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, 
నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?
= వినోబా భావే.

14. “సంశయములు నన్నావ రించినపుడు, సంకటములు సంప్రాప్త మైనపుడు, 
నిరాశా నిస్పృహలు జనించి నపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. 
అందు ఏదో ఒక శ్లోకము నన్నూర డించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?
= మహాత్మా గాంధీ.

15. భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?
= సంజయుడు.

16. సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=కుమారస్వామి.

17. మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి?
=దేవదత్తము.

18. భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి?
= ఐదు. 
(అనుష్టుప్, 
ఇంద్రవజ్ర, 
ఉపేంద్రవజ్ర, 
ఉపజాతి, విపరీతపూర్వ.)

19. భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?
=నలుగురు. అర్జునుడు, 
వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు.

20. ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= శ్రీరామచంద్రుడు.

21. భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?
=అచ్యుత, 
అనంత, జనార్ధన.

22. భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?
=ధనుంజయ, పార్ధ, కిరీటి.

23. శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను. 
ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి?
=గీతా గానం.

24. “ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపమున వ్రాసిన ఆంగ్లకవి ఎవరు?
=ఎడ్విన్ ఆర్నాల్డ్.

25. మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి?
=పౌండ్రము.

26. ఏకాదశ రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=శంకరుడు.

27. “నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను. 
కానీ అప్పటినుండి భగవద్గీత యను తల్లి ఆ స్ధానమును ఆక్రమించి, 
నా పక్కనే వుండి నన్ను కాపాడుచున్నది.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?
=మహాత్మాగాంధీ.

28. భగవద్గీత 
ఏ వేదము లోనిది?
=పంచమ వేదం-మహాభారతం.

29. భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది?
=11వ అధ్యాయము

30. ద్వాదశాదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=విష్ణువు

31. భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి?
=అర్జున విషాద యోగము.

32. భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుధ్ధము చేయగలడు?
=పదివేలమంది.

33. మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి?
=అనంతవిజయము.

34. భగవద్గీత  మొదటి శ్లోకం 
ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది?
= “ధర్మ” - శబ్దముతో గీత ప్రారంభ మయినది.

35. ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతీ విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికపుడు ప్రత్యక్షంగా (లైవ్) వివరించినదెవరు?
=సంజయుడు.

36. భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు?
=దృష్టద్యుమ్నుడు.

37. ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వజ్రాయుధము.

38. మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహము పేరేమిటి?
=వజ్ర వ్యూహం.

39. గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు?
=భీష్ముడు.

40. సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాసుకి.

41. అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= అనంతుడు.

42. మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి?
=సుఘోషము.

43. అర్జునుని ధనస్సు పేరేమిటి?
=గాండీవము.

44. జీవునకు 
ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పెను?
=నాలుగు. (బాల్యము, యౌవనము, వార్థక్యము, 
దేహాంతర ప్రాప్తి)

45. నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= గంగానది.

46. ఆత్మ యెట్టిది?
=నాశరహితమైనది.

47. కొంత ఆచరించి మధ్యలో వదిలివేసిననూ నిష్ఫలము కాని కర్మను ఏమందురు?
=నిష్కామ కర్మ.

48. మనుజునకు దేనియందు అధికారము కలదు?
=కర్మలు చేయుటయందు మాత్రమే. (ఫలము నాశించుట యందులేదు.)

49. అర్జునుడు ఎవరి లక్షణములు-భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను?
=స్థితప్రజ్ఞుడు (జీవన్ముక్తుని లక్షణములు.)

50. వృక్షములలో తాను ఏ వృక్షమని 
శ్రీ కృష్ణుడు చెప్పెను?
= రావిచెట్టు.

51. పంచభూతములచే నాశనము పొందనిది ఏది?
=ఆత్మ.

52. మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి?
=మణిపుష్పకము.

53. ప్రపంచమున పూర్ణానందమెచట లభించును?
=ఆత్మయందు.

54. మహాభారత సంగ్రామంలో అర్జునుని రధము యొక్క జెండాపై గల వానరుడెవరు?
=హనుమంతుడు.

55. పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= గరుత్మంతుడు.

56. ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును?
=తాబేలు.

57. కర్మచేయుట మేలా, చేయకుండుట మేలా?
=చేయుటయే మేలు.

58. బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించునపుడు వారితో సహా మఱి వేనిని సృష్టించిరి?
=యజ్ఞములు (సత్కార్యములు, దైవకార్యములు)

59. వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలెను?
=లోక క్షేమం కొరకు.

60. ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= కామధేనువు.

61. స్వధర్మ, పరధర్మములలో ఏది శ్రేష్ఠమైనది?
=స్వధర్మము.

62. పొగచేత అగ్నియు, 
మురికిచేత అద్దము, 
మావిచేత గర్భమందలి శిశువు కప్పబడి వున్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడియుండును?
=కామము చేత.

63. దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకొన్ననూ పాపమును చేయుచున్నాడు?
= కామము యొక్క ప్రేరణచే.

64. భగవంతుడెపుడు అవతరించును?
=ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధి పొందునపుడు.

65. అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ప్రహ్లాదుడు.

66. గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= చిత్రరథుడు.

67. హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేనివలన కలుగగలదు?
=జ్ఞానతపస్సు.

68. జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి?
=పరమశాంతి.

69. ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు?
=గాలిలేనిచోట గల దీపంతో.

70. ఏ సాధనములచేత మనస్సు నిగ్రహింపబడగలదు?
=అభ్యాసము, వైరాగ్యము.

71. భయంకరమైన మాయను దాటుట ఎట్లు?
=భగవంతుని శరణుపొందుట వలన.

72. భగవంతుని సేవించువారిని ఎన్నిరకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను?
=నాలుగు రకాలు (ఆర్తుడు, 
జిజ్ఞాసువు, 
అర్ధార్థి, జ్ఞాని.)

73. భగవత్స్వరూపమును ఎవరు తెలిసి కొనలేరు?
=అజ్ఞానులు.

74. విద్యలలోకెల్లా శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది ఏది?
=బ్రహ్మవిద్య.

75. మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= భృగు మహర్షి.

76. బ్రహ్మవిద్యకు అర్హత యేమి?
=హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము.

77. ఆకాశమునందు వాయువు వలె, 
సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితిగలిగి యున్నది?
=పరమాత్మయందు.

78. గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెట్లు కాగలడు?
=పరమాత్మయందు అనన్యభక్తిచే.

79. ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు?
=భగవంతుని భక్తుడు.

80. సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యగాత్మ ఎవరు?
=సాక్షాత్తు పరమాత్మయే.

81. ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=మనస్సు.

82. పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను?
=మేరువు.

83. పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=బృహస్పతి.

84. వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=ఓం కారము.

85. యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు నుడివెను?
=జప యజ్ఞము.

86. ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఐరావతము.

87. గుర్రములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఉచ్ఛైశ్శ్రవసము.

88. శ్రీకృష్ణ భగవానునిచే ఆహారము ఎన్ని రకమలుగా పేర్కొనబడెను?
= మూడు 
(సాత్విక, రాజస, తామసాహారము)

89. దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= నారదుడు.

90. సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=కపిల మునీంద్రుడు.

91. భగవద్గీత చివరి అధ్యాయము పేరేమిటి?
= మోక్షసన్యాస యోగము.

92. లెక్కపెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= కాలము.

93. జలచరాలలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= మొసలి.

94. ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన మూడు గుణములేవి?
= సత్త్వ, రజ, తమో గుణములు.

95. వేగముగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాయువు.

96. భక్తియోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?
= 35.

97. విద్యలోల తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఆధ్యాత్మ విద్య.

98. రాగద్వేష రహితముగా, 
తత్త్వ నిశ్చయము కొరకు వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాదము.

99. అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= "అ"-కారము.

100. భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను?
= అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)

101. మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= మార్గశిరము.

102. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?
= 20 (ఇరువది).

103. శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు 
ఎన్ని పేర్కొనబడెను?
= 26 (ఇరువదియాఱు).

104. శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను?
= 6 (ఆఱు).

105. తపస్సు లెన్ని రకములు?
= మూడు 
(శారీరక, వాచిక, మానసిక)

106. పరబ్రహ్మమునకు ఎన్నిపేర్లు కలవు?
= మూడు 
(ఓమ్, తత్, సత్).

107. మోక్షమును పొందుటకు కర్మలను వదల వలెనా?
=లేదు. 
కర్మలు చేయు నపుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై వుండ వలెను.

108. సంజయుడు ఎవరి అనుగ్రహముచే ఈ గీతా సంవాదమును నేరుగా (లైవ్) విన గలిగెను?
వేదవ్యాసుడు.

శివునకు ఎదురుగా నందికి కారణం ఇదేనట

శివునకు ఎదురుగా నందికి కారణం ఇదేనట 


🌹 శివాలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా నంది దర్శనమిస్తుంది. శివుడి వాహనమైన నంది రెండు కొమ్ముల మధ్య నుంచి లింగాన్ని చూస్తారు. మరికొందరునంది చెవిలో తమ కోరికలను చెప్పుకుంటారు. అయితే, నంది ప్రాముఖ్యత వెనుక ఓ బలమైన కారణం ఉంది. అపార జ్ఞాన సంపన్నుడైన శిలాదులనే ఋషికి సంతానం లేకపోవడంతో వెలితిగా ఉండేది. సంతాన భాగ్యం కోసం తపస్సు చేసి, పరమేశ్వరుని ప్రసన్నం చేసుకున్నాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు సంతాన వరాన్ని ప్రసాదించాడు. 

🌹 శివుడి వరం పొందిన శిలాదుడు యజ్ఞం చేస్తుండగా హోమ గుండంలో నుంచి బాలుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడికి నంది అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుతున్నాడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడు అని అర్ధం... ఆ బాలుడి మేధస్సు కూడా అసాధారణంగా ఉండేది. చిన్నతనంలోనే వేదాలన్నీ అవపోసన పట్టేశాడు నంది. 


🌹 ఒక రోజు శిలాదుడు ఆశ్రమానికి మిత్ర వరధులనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో నందిని చూసి అతడు తమకు చేసిన అతిథి సత్కారాలకు మురిసిపోయారు. వారు వెళుతూ నందిని ‘దీర్ఘాయుష్మాన్ భవ’ అని ఆశీర్వదించబోయి ఒక్కసారి ఆగారు. నంది వంక దీక్షగా చూస్తుండగా వారి చూపుల్లోని ఆంతర్యాన్ని శిలాదుడు గ్రహించాడు. నంది ఆయుష్షు త్వరలోనే తీరిపోతుందని వారి ద్వారా తెలియడంతో ఆందోళన చెందాడు. 

🌹 అయితే, దీనికి పరిష్కా మార్గం శివుడే సూచిస్తాడని నంది తపస్సు చేశాడు. ఆయన తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యారు. శివుడ్ని చూసిన నందికి నోటిలో నుంచి మాట రాలేదు. 

🌹 శివుడి పాదాల చెంత ఎంత బాగుందో కదా అనుకుని, తన ఆయుష్షు గురించి మరిచిపోయి చిరకాలం నీ చెంతే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని కోరుకున్నాడు. నంది భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు వృషభ రూపంలో తన వాహనంగా ఉంటామని అనుగ్రహించాడు. నాటి నుంచి శివుడి ద్వారపాలకుడిగా కైలాసానికి రక్షకుడిగా తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. 

🌹 క్షీరసాగర మథనంలో హలాహలం జనించిగా లోకాలను కాపాడేందుకు శివుడు దానిని తన కంఠంలో దాచుకున్నాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం ఒలికి కిందపడటంతో శివుడి చెంతనే ఉన్న నంది ఏ మాత్రం సంకోచించకుండా దానిని తాగేశాడు. దేవతలే ఆ విషానికి భయపడి పారిపోతుంటే నంది శివుని మీద నమ్మకంతో సంతోషంగా స్వీకరించాడు. అందుకే శివుడికి సేవకుడిగానే కాదు ముఖ్య భక్తుడిగా కూడా పూజలందుకుంటున్నాడు. 

శివోహం అంటే అర్ధం తెలుసా?

శివోహం అంటే అర్ధం తెలుసా? 

        మనం మానవులం.. ఎన్నో కర్మలు చేస్తాం. ఇలాంటి మనం శివుడు ఎలా అవుతాం? శివోహం అని ఎందుకు అంటున్నాం? మనం శివుడిగా మారాలి అంటే మనం తెలుసు కోవలసినది ఏమిటి? మన గ్రూప్ లో ఉన్న సభ్యులు అందరికి తప్పక తెలియాల్సిన విషయం ఇది. 

          ఆది శంకరాచార్యుల వారి సాహిత్యమును స్తోత్ర (భక్తి) సాహిత్యము, వైరాగ్య ప్రకరణములు అని రెండుగా విభజించవచ్చు... ఆది శంకరాచార్య విరచిత నిర్వాణషట్కం వైరాగ్య ప్రకరణముల కోవలోనిది. నిర్వాణషట్కం భారతీయ వేదాంత మార్గంలో ఉన్నతమైన రచన. నిజానికి ఎంతో దీర్ఘమైన వ్యాఖ్యానము, వివరణ అవసరము. కాని, ఇక్కడ క్లుప్తముగా మాత్రమే చర్చ ప్రస్తుతానికి! ఆధునిక పోటీ పరీక్షలలో సమాధానం సరిగా తెలియనప్పుడు, సరైనవి కాని సమాధానములను వరుసగా ఇది కాదు, ఇది కాదు అని.. చివరికి సరి ఐన లేదా సరి ఐనట్లు అనిపించిన సమాధానము ను చేరుకొనే పద్ధతి ఒకటి ఉంది. భగవంతుని రూపమును, తత్త్వమును తెలిసికొనడం అసాధ్యం కనుక, ఏది భగవంతుడో తెలియనప్పుడు, ఏది భగవంతుని తత్త్వమో తెలియనప్పుడు ఏది భగవంతుని తత్త్వము కాదో తెలిసికొనడం తేలిక కనుక 'ఇది కాదు' 'ఇది కాదు'అని తీసి వేస్తూ చివరికి మిగిలిన వర్ణనకు, వ్యాఖ్యానమునకూ అందని తత్త్వమేదో అదే పరమాత్మ తత్త్వము అని తెలిసికొనడాన్ని వేదాంతం.

      ''నేతి... నేతి'' అంటే, 'న ఇతి', 'న ఇతి', అంటే, 'ఇది కాదు' 'ఇది కాదు'.. అని చెప్పింది! 'మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం' మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగువిధములైన అంతఃకరణ ప్రవృత్తులు వున్నాయి. మనసు అన్నింటికీ అధిపతి. లేని దాన్ని ఉన్నట్లుగా, తనది కాని దాన్ని తనదే అన్నట్లుగా, క్షణికమైన దానిని శాశ్వతమన్నట్లుగా మరులు గొల్పుతుంది,  వుసి గొల్పుతుంది, పురి కొల్పుతుంది, భ్రమింప జేస్తుంది, మరిపిస్తుంది, మురిపిస్తుంది. ఆకాశానికెత్తేస్తుంది. కడకు పాతాళానికి తొక్కేస్తుంది.

        మనిషికి మనస్సే అన్నింటికి మూల కారణం, ప్రేరణ, ఉత్ప్రేరకం, వినాశకరం. 

        నాది, నాది కాదు - అనేదే బంధానికి, మోక్షానికి కారణాలు. నాది అనేది, నాకు మాత్రమే అనే విచిత్ర బంధం. ఇతరులగురించి ఆలోచింపజేయదు. ఎవరికి చెందకూడదు అంటుంది. పూర్తి స్వార్థం. ఇది వినాశనానికి దారితీస్తుంది. 

       నేను అనేది సాత్వికం. నేను కూడా అనేది రాజసిక అహంకారం. నేను మాత్రమే అనేది తామశిక అహంకారం. 

       నేను ఏమిటి, ఎవరు, ఎందుకు, ఎక్కడ నుండి ఎక్కడికి అనే అన్వేషణ సాత్వికం. మనిషిని ఉన్నతస్థితికి చేర్చుతుంది. నేను కూడా అనేది రాజసికమైనది. నాకు ఒక ఉనికి, నాకు శక్తి ఉంది అని సాధనకు ఉపయోగిస్తుంది. ఈ రెండూ మంచివే, అవసరమే.

        నేనుమాత్రమే, నాకు మాత్రమే అనే తామసిక ప్రవృత్తి కల్గిన వారికి, వారిని వారి ద్వారా నే సర్వ నాశనం చేస్తుంది. 

      దీనికంతా మనస్సే కారణం.    

      కనుకనే మనస్సును బుద్ధికి స్వాధీనం చేసి, బుద్ధి ద్వారా కల్గిన విచక్షణ తో మంచి చెడులు తెలుసుకొని, మంచిని గ్రహించి, చెడును పారద్రోలాలి. కనుక బుద్ధి పరమాత్మ తత్వం. 

      బుద్ధికి మనస్సును అప్పచెప్పి జీవిత ప్రయాణం చేస్తే, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దారి తప్పవు. మంచి కర్మలు మిగులుతాయి. అప్పుడు మానవుడు శివుడవుతాడు.