Wednesday, January 16, 2019

Makara Sankranti Celebrations


Makara Sankranti Celebrations


Importance of Makara Sankranti



*🙏🏼సంక్రాంతి సంబరాలు🙏🏼*

తెలుగు వారి పెద్దపండుగ సంక్రాంతి.
నెల రోజులపాటు జరుపుకునే పండగ సంక్రాంతి. మనం జరుపుకునే పండుగలన్నీ ఏదో దైవానికి సంబంధించినవే.!
కానీ సంక్రాంతి పండుగ మాత్రం పంటల పండుగ. రైతుల పండుగ. కళాకారుల పండుగ. ఈ పండుగ కు మూలపురుషుడు రైతన్న.ఆరుగాలం పంటపొలాలలో శ్రమించే రైతన్న చేసుకునే పండుగ ఇది.
తన పంట కోతకొచ్చినప్పుడు ఉదయం నుంచీ అర్ధరాత్రి వరకు పొలంలో కష్టపడిన రైతన్నకు కళాకారులు అందరూ అండగా నిలబడతారు.వాళ్ళ వివరాలు తెలుసుకుందాం.
       
బుడబుక్కలవాడు:
ఈ పండుగ కళారూపాలలో తొలి తాంబూలం బుడబుక్కలవానిది.
పగలంతా కష్టపడిన రైతన్న రాత్రికి నడుం వాలిస్తే కళ్ళంలోని ధాన్యాన్ని దొంగలు తరలించుకు పోకుండా తొలిఝూములో ఊరి పొలిమేరలలో సంచరిస్తూ క్రొత్తవాళ్ళను గ్రామంలోకి చొరబడనీకుండా 'కట్టు' కట్టి కట్టడి చేసేవాడు బుడబుక్కలవాడు.ఇతను తొలిఝామంతా పంటకు కాపలా కాసి రెండోఝాము ప్రవేశిస్తుండగా జంగం దేవరకు ఆ పని అప్పచెబుతాడు
Image result for బుడబుక్కలవాడు:

        జంగందేవర:

సాక్షాత్తూ శివుని అవతార అంశలుగా భావించే ఈ జంగందేవరలు శంఖనాదాలతో ఢమరుక శబ్దాలతో రైతుల కళ్ళాలకు ఊరి ప్రజానీకానికి శుభం పలుకుతూ పరమశివుని ఆశీస్సులను అందించే కాపాలికుడు ఈ జంగందేవర!
 
Image result for జంగందేవర:

           హరిదాసు:
'హరిలో రంగ హరి'అంటూ శ్రీకృష్ణుని గాధలను కీర్తిస్తూ ఇంటింటి ముంగిటికీ వచ్చి పొలం వెళ్ళిన రైతుల క్షేమసమాచారాలను వాళ్ళ ఇళ్ళలో తెలుపుతూ హరినామసంకీర్తనామృతాన్ని దోసిళ్ళతో అందించి దోసెడు బియ్యాన్ని కృష్ణార్పణమంటూ స్వీకరిస్తాడు.ఆ యదుకులేశుని ఆశీస్సులను తన ద్వారా మనకు అందిస్తాడు.
Image result for హరిదాసు:

                 గంగిరెడ్లు:


హరిదాసు ఇంటిలోని వారిని పలకరించి ఇంటి ఆడపడుచులు వేసిన రంగవల్లులపై కృష్ణపరమాత్మ ఆశీస్సులు కురిపించాక 
 'అయ్యగారికి దండం పెట్టు
 అమ్మగారికి దండం పెట్టు
 బాబుగారికి దండంపెట్టు
 పాపగారికి దండం పెట్టూ'
అంటూ బసవన్నల చేత దండాలు పెట్టించి,రైతు బ్రతుకుకు అంతా తానై నడిపే ఎడ్లను అలంకరించి ఇంటి ముంగిట్లో ఎడ్ల ఆట ఆడించి ఇంట్లోని చిన్నా పెద్ద అందరినీ అలరించిన గంగిరెద్దుల వాళ్ళు సన్నాయి ఊదుకుంటూ వెళ్ళిపోతారు
Image result for గంగిరెడ్లు:

            పిట్టలదొరలు:

గంగిరెడ్లు, డూడూ బసవన్నలు వెళ్ళాక మనలను నవ్వులలో ముంచెత్తే కబుర్ల పోగు,కోతలరాయుడు పిట్టలదొర వస్తాడు. తనకు ఆరేబియా సముద్రంలో ఆరువేల ఎకరాల భూమి ఉందని,బంగాళాఖాతంలో బంగ్లాలున్నాయని ఆ బంగ్లాలకు వెళ్ళడానికి సరైన దారిలేక ఈమధ్యనే బొప్పాయి కలపతో బ్రహ్మాండమైన బ్రిడ్జి కట్టించాననీ అవన్నీ పిల్లలు అడిగితే ఇచ్చేస్తానని డంబాలు పోతాడు.పిల్లలందరికీ నవ్వుల పువ్వులు పంచుతాడు

                  సోదెమ్మ

  సోదెమ్మ వెళ్ళిన తరువాత మన భవిష్యత్ ఫలాలను చెబుతానంటూ
'సోదె చెబుతానమ్మా సోదె చెబుతాను
ఉన్నదున్నట్టు చెబుతాను లేనీదేమీ చెప్పను తల్లీ'అంటూ మన భావిలో జరగబోయే వాటి గురించి తనకు తోచింది చెప్పి ఇంత ధాన్యం, పాతచీర,రవికల గుడ్డ పెట్టించుకుని పోతుంది.

                   భట్రాజులు:

ఆరు నెలల కష్టానికి ఫలితం వచ్చేవేళలో ధాన్యాన్ని ఇంటికి తరలించే సమయంలో రైతుల కళ్ళాలలోకి వెళ్ళి రైతుని ఆతని వంశాన్ని ఆతని పెద్దలనూ పొగడుతూ ఆ రైతు కుటుంబం నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవిస్తూ పద్యాలల్లి ఆశీస్సులను వెదజల్లి ఓ కుంచెడో రెండు కుంచాలో ధాన్యాన్ని కొలిపించుకుని భుజాలకెత్తుకుంటారీ భట్రాజులు.

                   కొమ్మదాసర్లు:

అన్ని పనులు పూర్తి చేసుకున్న తరువాత కాస్త నడుం వాల్చి విశ్రాంతి తీసుకుందామనుకుంటే ఈ కొమ్మదాసరోడు వచ్చి పెరట్లో చెట్టుకొమ్మనెక్కి 'అప్పయ్య గోరో పడతా పడతా నే పప్పుదాకలో పడతా,పడతా పడతా నే పాతరగోతిలో పడతా'అంటూ అల్లరి చేస్తాడు.అమ్మలక్కలు,పిల్లలు చెట్ల క్రింద జేరి క్రిందకు దిగమని బ్రతిమాలతారు.ఆ పాతరగోతి మీద పాతబట్టలు పరచమని చెప్పి వాటిని పట్టుకెడతాడు.
ఇక్కడ పాతరగోతి గురించి చెప్పాలి.పూర్వం పండిన పంటను ఇంటికి తెచ్చి పెరట్లో గొయ్యి తవ్వి ఆ గోతిలో తాటాకులు కొబ్బరాకులు పరిచి వాటీపైన గడ్డి పరిచి మెత్తను తయారుచేసి ఆపైన ధాన్యం పోసి నిలవచేసే వారు.
దీనినే పాతరగొయ్యి అంటారు.పొద్దన్నుంచి పని చేసి చేసి అలసి సొలసి నిద్రపోతారేమో ఇదే సందని దొంగలు ఆ గోతిని తవ్వి పండిన పంటనంతా దోచుకుపోవచ్చు.మీ పాతరగొయ్యి సరిగా ఉందో లేదో ఓ సారి చూసుకోండి అని చెప్పడానికి ఈ కొమ్మదాసరి వస్తాడు.
ఈవిధంగా ఇంతమంది కళాకారులు నెలరోజుల పాటు రైతుల పంటలకు కాపలా కాస్తూ రైతుల క్షేమాన్ని కాంక్షిస్తూ మన పొలాలకు పహారా ఇస్తారు.
మనకింత సాయం చేసిన వాళ్ళకు మనమేమిస్తున్నాము???
నాలుగు గుప్పెళ్ళ బియ్యం,నాలుగు పాత గుడ్డపీలికలు.
ఇంటిల్లిపాది మంచిని కోరుకుంటూ మన ముంగిటికొచ్చే కళాకారులను ఆదరించండి!!!
వెండితెరపై, బుల్లితెరపై ఓ సారి కనబడిన వాళ్ళందరికీ వేలు,లక్షలు పోసి వాళ్ళ వెకిలి చేష్టలను ఆనందించేకన్నా మన సౌఖ్యాన్ని,మన సౌభాగ్యాన్ని కోరుకునే ఈ పల్లె కళాకారులను అక్కున జేర్చుకుందాం!!!!!!


ఈ పండుగను కేవలం మత సంబంధమైనదిగా కాక సాంప్రదాయాల, అనురాగ ఆప్యాయతల,పల్లెటూరుల వైభవాల, రైతుల ఆనందాల పండుగగా చెప్పాలి. ఈ మూడు రోజుల పండుగ గురించి క్లుప్తంగా..,

సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం  సంక్రాంతి.  సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరిమాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 15తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.
 
ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి. కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు  అనగా భోగి, మకర సంక్రమణం, కనుమ  కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు నాలుగోరోజు ముక్కనుమ గా జరుపుతారు. కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో  రైతులు ఈ పండుగ జరుపు కుంటారు  కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది.

నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు ముందుగానే సంక్రాంతి వాతావరణంతెలుగునాటప్రారంభమవుతుంది. ఈ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతాయి. బుడబుక్కలవాళ్లు, పగటివేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. స్త్రీలు  ఈ పండుగ నెలరోజులు  - ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను  రంగవల్లులు,  గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు. కళ్లం నుంచి బళ్ల మీద ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి. భోగినాడు  భోగిమంట విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు ఇస్తారు. ఈ పెద్ద పండుగకు కొత్త అల్లుడు  తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు.  మరదళ్ల ఎకసెక్కాలకు ఉడుక్కుంటాడు. కోడి పందాలు, ఎడ్ల బళ్ళ పందాలు జరుగుతాయి. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు.
మొదటి రోజు  భోగి
ఇది సాధారణంగా జనవరి 14న జరుపుతారు. ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే 3:30, 4:00 మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని  ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాక  ఇంట్లో ఉండే పాత చీపుర్లూ,  తట్టలూ, విరిగిపోయిన బల్లలూ వగైరాలను వదిలేసి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా వాటిని ఈ రోజున భోగి మంటలు లో వేసి వెలిగిస్తారు.
సాయంత్రం పూట చాలా ఇళ్ళలో స్త్రీలు, చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను  ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంత మంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు మరియు బందువులు సమావేశమై, రేగిపళ్ళు, శనగలు,పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టితొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో  పాటు పట్టుబట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ.

రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో  అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చక్కినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. 
 సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు.  చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు,  సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టుఅంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు.కొత్త దాన్యము వచ్చిన సంతోషంతో మనము వారికి దాన్యమ్ ఇస్తాము.      హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు.
మూడవ రోజు కనుమ... రైతులు వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్న పశువులకు శుభాకాంక్షలు తెలుపటానికి ఈ పండుగ జరుపుతారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం  నిషేధించింది. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ. 
కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశం లోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులను శ్రద్ధాసక్తులతో జరుపుకుంటారు. 
మూడురోజులపాటు సాగే సంక్రాంతి పండుగలో మొదటి రోజున నాలుగు మార్గాల కూడలిలో వేయబడే పెద్ద మంట. అప్పటి నుండి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నడనే సంకేతం. దక్షణాయంలో ఉండే నిద్ర బద్దకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతంతో చీకటితోనే బోగిమంట వేస్తారు. ఇంట్లో ఉండే పాత కలపసామానులు, వస్తువులు, ఎండుకొమ్మలు లాంటివి బోగి మంటలో వేసి తగులబెడుతారు. వీటన్నిటినీ దారిద్ర్య చిహ్నాలుగా బావించి తగులబెట్టాలంటారు. వేసవిలో వేడికి తగులబడే వాటిని గుర్తించాలనే మరొక సంకేతం కూడా ఇందులో దాగిఉంది.
భోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.♦


*కనుమ ఇలా...* 


రైతన్నకీ వ్యవసాయానికీ వెన్నుదన్నుగా నిలిచే వృషభరాజాల పట్లా, పాడిపశువుల పట్లా కృతజ్ఞత తెలిపే రోజు కనుమ. దీన్నే కొన్ని ప్రాంతాల్లో పశువుల పండగగా వ్యవహరిస్తారు. ఆ రోజు పశువులకూ, జోడెడ్లకూ బొట్టుపెట్టి పసుపురాసి దండం పెడతారు. పశువుల కొట్టంలో పొంగలి చేసి, మూగజీవాలకు వడ్డిస్తారు. ఆ పొంగలిలోనే కొద్దిగా పసుపూ కుంకుమా కలిపి పొలాల్లో చల్లుకుంటారు. దీన్నే పొంగలి చల్లడం అంటారు. కనుమనాడు మినుము తినాలన్నది పెద్దలు చెప్పేమాట. అందుకే ఆ రోజు మినపగారెలూ, ఆవడలూ తప్పక చేస్తారు. పెద్దపండగకు చేసే పిండి వంటలు శరీరానికి పుష్టినిస్తాయి. రంగవల్లులూ, గొబ్బెమ్మలూ ఇంటికి కొత్త కళను తీసుకువస్తాయి. గొబ్బిపాటలూ, హరినామ సంకీర్తనలూ పల్లెకు సందడిని తీసుకువస్తాయి... ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి పండగలో జరిగే ప్రతి ఆచారం మనిషిని ప్రకృతితో జతచేసేదే. బంధుత్వాలని కలుపుతూ ఆనందాలని పంచుతూ మనుషులందరినీ ఒక్కటి చేసేదే ఈ పండగ.!
 
 

No comments:

Post a Comment