Monday, April 15, 2019

Importance of Ugadi How to celebrate Ugadi?

Importance of Ugadi
How to celebrate Ugadi?



ఉగాదిని ఎలా జరుపుకోవాలి.. ఉగాది విశిష్టత

ఉగాది విశిష్టత ఏమిటి, ఎలా చేసుకోవాలి, ఆరోజు చేయాల్సిన దైనందిన కార్యక్రమాల గురించి శాస్త్రం ఏం చెబుతుంది అనే విషయాలు సంక్షిప్తంగా…

పర్వదినాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన పండుగ ఉగాది. యుగానికి ఆది యుగాది.. కాలక్రమేణ ఉగాదిగా మారింది. సంస్కృతంలో యుగాది అనే మాటకు కృత, త్రేత, ద్వాపర,కలియుగాల్లో ఏదో ఒకదానికి ఆది లేక ప్రారంభం అని అర్థం. తెలుగులో ఉగాదిని సంవత్సరాది అంటే కొత్త ఏడాది ప్రారంభంగా వాడుతున్నాం. చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకొంటాం.

Image result for ugadi
పురాణాల్లో ఉగాది
బ్రహ్మపురాణం, నారద పురాణం, మత్స్య పురాణాల్లో ఉగాది గురించి ఉంది. ఇక రామాయణంలో రావణ సంహారం తర్వాత చైత్రశుద్ధ పాడ్యమి రోజున రాముడు అయోధ్యకు బయలుదేరుతాడు. తర్వాత వసుచరిత్రలో, విక్రమార్క పట్టాభిషేకం పలు సందర్భాలు ఉగాది గురించి తెలియజేస్తున్నాయి.
ఉగాదిని ఎలా జరుపుకోవాలి:

అభ్యంగన స్నానం
ధర్మసింధువు, నిర్ణయ సింధువు అనే ధర్మశాస్త్ర గ్రంథాలు ఉగాది నాడు చేయాల్సిన విధులను పేర్కొన్నాయి. వాటి ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటుకొని అభ్యంగన స్నానాన్ని చేయాలి. దీని వల్లన లక్ష్మీ, గంగల అనుగ్రహం కలుగుతుంది. సైన్స్ పరంగా శారీరక పుష్టి కలుగుతుంది. అభ్యగంగన స్నానం అంటే శరీరమంతా నూనెను పట్టించి కొంతసేపు ఆగి నలుగు పిండితో స్నానం చేయాలి.




గృహాలంకరణ
ఉగాదినాడు రంగవల్లులతో, పుష్పతోరణాలు, మామిడిఆకుల తోరణాలతో ఇంటిని అలంకరించుకోవాలి. దేవుని గదిలో ప్రత్యేక మంటపాన్ని వేసి దాన్ని అలంకరించి కొత్త పంచాంగాన్ని ఉంచాలి.

ఉగాది పచ్చడి
అన్ని పండుగల్లోకి ప్రత్యేకమైనది ఉగాది. ఈ రోజు చేసే పచ్చడి చాలా ప్రత్యేకత, విశేషత కలిగినది. ఏడాదిలో అన్ని రకాల రుచులను ఆస్వాదించాలనే తత్త బోధచేసే ఈ పచ్చడిని తప్పక ప్రతి ఒక్కరు స్వీకరించాలి. వేపపువ్వు, కొత్త చింతపండు, బెల్లం, మామిడికాయ ముక్కలు, ఉప్పు, శనగపప్పు సాధారణంగా వాడుతారు. మరికొన్ని ప్రాంతాల్లో జీలకర్ర, చెరుకు ముక్కలు, కొంచెం కారం, నేయి వంటివి కూడా వాడుతారు. మొత్తం మీద షడ్రుచుల సమ్మితంగా దీన్ని తయారుచేస్తారు. దీన్ని కొత్త కుండలో/గిన్నెలో తయారుచేసి పంచాంగ పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టి తీర్థ ప్రసాదాలను, ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు.



పంచాంగ శ్రవణం
అవకాశాన్ని బట్టి దగ్గర్లోని దేవాలయం లేదా పంచాంగ శ్రవణం జరిగే ప్రాంతానికి వెళ్లాలి. దీనిద్వారా నూతన సంవత్సర గోచార ఫలాలు, కందాయ ఫలాలు, ఆదాయ వ్యయాలు, శీతోష్ణస్థితులు, పంటలు, నవనాయకుల ఫలాలను తెలుసుకోవచ్చు.

ఉగాది నాడు ఏ పూజలు చేస్తారు
ఉగాదినాడు ఇంద్రధ్వజ పూజ, బ్రహ్మధ్వజ పూజ, ఛత్రచామరాది స్వీకారం, రాజదర్శనం, వసంత నవరాత్రుల ప్రారంభం అవుతాయి. ఇంకా పలు ప్రాంతాల్లో పలు రకాలుగా ప్రాంతీయ ఆచారాలను పాటిస్తారు.

Image result for ugadi 
కొత్త దస్త్రం
సంవత్సరాదినాడు వర్తకులు కొత్త దస్ర్తాలను అంటే ఖాతా పుస్తకాలను ప్రారంభించడం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. పండితులు వేద, శాస్త్ర పూజ గ్రంథాలను పూజిస్తారు.
అందరూ ఆనందంగా ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆరాధించి ఉగాదిని సంబురంగా జరుపుకోండి. కొత్త కొత్త ఆలోచనలతో ఉగాది నుంచి పరోపకారం, లోకకళ్యాణం, కుటుంబ ధర్మాన్ని ధర్మబద్ధంగా ఆచరించి సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్థిలాలని ఆ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తూ.. మంగళం మహత్!

No comments:

Post a Comment