Saturday, February 11, 2017

Peddagattu Peddajathara

Peddagattu Peddajathara

Durajpalli, Suryapet district


పెద్దగట్టు పెద్దజాతర!

తెలంగాణలో ప్రఖ్యాతి చెందిన జాతరల్లో ఒకటైన పెద్దగట్టు జాతరకు దురాజ్‌పల్లి ముస్తాబైంది. గజ్జెల లాగులూ, భేరీ చప్పుళ్లతో శివసత్తులు ఇక్కడ సందడి చేయనున్నారు. లింగమంతుల స్వామికి బోనం సమర్పించుకునేందుకు దాదాపు ముప్పైలక్షల పైచిలుకు జనం ఈ వేడుక్కి హాజరుకానున్నారు.
బోళాశంకరుడైన శివుడు భక్తులకు అచ్చంగా కొంగుబంగారమే. అందుకే శివయ్య దర్శనం చేసుకోవాలని భక్తులు తహతహలాడుతుంటారు. మరి ఆయనకు జాతర చేస్తుంటే ఇంకెంత వైభవంగా జరగాలనుకుంటారు. కాబట్టే సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలోని పెద్దగట్టులో వెలసి ఉన్న లింగమంతుల స్వామి జాతరంటే జనజాతరే అనిపిస్తుంది. లింగమంతుల స్వామి, పేరుకు యాదవుల ఆరాధ్యదైవమైనా అన్ని వర్గాల వారూ వస్తారిక్కడికి. ప్రతి రెండేళ్లకోసారి జాతర (ఈ ఏడాది ఫిబ్రవరి 12 నుంచి) జరిగే ఈ స్వామికి పురాతన చరిత్రే ఉంది.
రాజుల కాలంలో...
కొన్ని శతాబ్దాల క్రితం చోళచాళుక్యులూ (యాదవ రాజులు), కాకతీయులూ చివ్వెంల మండలం వల్లభాపురం పరిధిలోని ఉండ్రుగొండ గుట్టలను కేంద్రంగా చేసుకుని పరిపాలించారు. వీరు ఉండ్రుగొండ గుట్టలలో శివుడు, లక్ష్మీనరసింహస్వామి, లింగమంతులస్వామి, చౌడమ్మ (స్వామి చెల్లెలు) దేవాలయాలతో పాటు మరికొన్ని గుళ్లనూ నిర్మించారట. అప్పట్లోనే ఈ గుట్టల్లో లింగమంతులస్వామి, చౌడమ్మ దేవతల జాతర అంగరంగ వైభవంగా జరిగేదట. ఎత్తయిన కొండలలో కొలువై ఉన్న లింగమంతులస్వామికి మొక్కు చెల్లించుకునేందుకు ఓ నిండుచూలాలు బోనం, పూజా సామగ్రితో కలగలిపిన మందగంపను ఎత్తుకొని గుట్ట పైకి ఎక్కుతుండగా కాలు జారి కింద పడి చనిపోయిందట. దీంతో లింగమంతులస్వామి భక్తులకు దగ్గర్లో ఉండేందుకు అక్కడికి సమీపంలోనే ఉన్న పాలసేర్లయ్యగట్టు (ప్రస్తుత పెద్దగట్టు) మీద వెలుస్తానంటూ భక్తులకు పూనకంలో చెప్పాడట. కాకతీయులతో యుద్ధం తర్వాత ఇక్కడికి వచ్చిన వైష్ణవ రాజులు గుట్టపైన ఉన్న విగ్రహాలను సమీపంలోని బావిలో పడేసినట్లు చెబుతారు.
ఇక్కడికొచ్చాడు...
చివ్వెంల మండలం గుంపుల, సూర్యాపేట దగ్గరి కేసారాలకు చెందిన పశువుల కాపరులు ఒకరోజు పశువులను మేపుతూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారట. లింగమంతుల స్వామి వాళ్ల కలలోకి వచ్చి తాను గుట్టకు సమీపంలో ఉన్న బావిలో ఉన్నాననీ, తనను పాలసేర్లయ్య గట్టు మీద ప్రతిష్ఠింపజేయాలనీ చెప్పాడట. పశువుల కాపరులు స్వామి చెప్పినట్టుగా విగ్రహాలు తెచ్చేందుకు బావిని తవ్వడం ప్రారంభించారట. అలా తవ్వేప్పుడు లింగమంతుల స్వామి విగ్రహానికి గునపం తగిలి పైభాగం కాస్త దెబ్బతిందట. అది ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుంది. లింగమంతులస్వామితో పాటు చౌడమ్మ, మాణిక్యమ్మ, ఆకుమంచమ్మ, యలమంచమ్మ, గంగమ్మ దేవతా మూర్తులూ అక్కడే దొరికాయట. తర్వాత ఆ విగ్రహాలను సంబరంగా గట్టుమీదకి చేర్చారు. అప్పటి నుంచి ఆచారబద్ధంగా ప్రతి రెండు సంవత్సరాలకోసారి ఐదు రోజులపాటు పెద్దగట్టు (గొల్లగట్టు) జాతరను జరుపుతున్నారు.
పెద్ద జాతర
జాతరకు వచ్చిన భక్తులు స్వామికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. జాతరకు పదిహేను రోజుల ముందే దిష్టి కార్యక్రమం నిర్వహించడంతో ఇక్కడి తంతు మొదలవుతుంది. మాఘమాసంలోని మొదటి ఆదివారం నాడు కేసారం గ్రామం నుంచి యాదవులైన మెంతబోయిన వంశం వారూ, గుంపుల గ్రామం నుంచి మున్న, గొర్ల వంశాల వాళ్లూ దేవరపెట్టెను వేడుకగా గట్టుకు చేర్చుతారు. చిన్నచిన్న దేవతా ప్రతిమలుండే ఈ పెట్టె కేసారంలో ఉంటుంది. ఈ విగ్రహాల్లో అందనపు చౌడమ్మను ప్రత్యేకంగా పూజిస్తారు. అనంతరం హక్కుదార్లు (మెంతబోయిన, గొర్ల వంశస్థులు), పూజారులు (మున్న వంశంవాళ్లు) తీసుకొచ్చిన బియ్యం ఉడికించి రెండు బోనాలను తయారు చేస్తారు. పసుపూ, కుంకుమా నిమ్మకాయలతో చంద్రపట్నం (ప్రత్యేక ముగ్గు) వేసి దిష్టి కుంభాలను రెండు రాశులుగా పోస్తారు. ఈ సందర్భంగా బైకానులు వచ్చి యాదవరాజుల కథలు చెబుతూ పూజలు నిర్వహిస్తారు. మరుసటిరోజు దేవతా ప్రసాదంగా భక్తులకు భోజనాలు ఏర్పాటు చేస్తారు. తర్వాత అదే రోజు సాయంత్రం అందనపు చౌడమ్మను తిరిగి వూరేగిస్తూ కేసారం గ్రామానికి చేరుస్తారు.

వైభవంగా...
దిష్టిపూజ అనంతరం 15 రోజులకు వచ్చే మాఘపౌర్ణమి తర్వాతి ఆదివారం నాటి రాత్రి మళ్లీ కేసారం నుంచి దేవరపెట్టెను గట్టుపైకి చేర్చడంతో జాతర ఆరంభమవుతుంది. మంగళవారం రోజు చంద్రపట్నం కార్యక్రమం నిర్వహించి స్వామి కల్యాణం చేస్తారు. తరువాతిరోజు బోనం కుండల్లో పాలు పొంగించి స్వామికి పూజలు నిర్వహిస్తారు. చౌడమ్మ తల్లికీ సంప్రదాయ మొక్కును చెల్లిస్తారు. అనంతరం దేవర పెట్టెను వూరేగింపుతో కేసారం గ్రామానికి తరలిస్తారు.
ఇలా వెళ్లాలి...
ఇక్కడికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి-65 మీద విజయవాడ వైపు ఏడు కిలోమీటర్లు ప్రయాణిస్తే పెద్దగట్టు వస్తుంది. దురాజ్‌పల్లి మీదుగా కోదాడ, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, విజయవాడలకు వెళ్లే బస్సుల్లోనూ చేరుకోవచ్చు. జాతర రోజుల్లో సూర్యాపేట నుంచి ప్రత్యేకంగా బస్సులను నడిపిస్తారు.
- ములుగూరి వెంకయ్య, 

No comments:

Post a Comment