Miracles of Bramarambha
Bramarambha Temple Srisailam
#శ్రీశైలంలో ఉండే భ్రమరాంబా అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్లి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసిన ఝుంకారము వినపడుతుంది. దానిని భ్రామరీ నాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెదరూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లిముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రములను వేశారు. అక్కడికి వెళ్లి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా పదిమంది చేత పండు ముత్తైదువ అని అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడమీద తల పెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది. శ్రీశైలలింగమునకు పట్టు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగానం వస్తుంది. భ్రమరాంబికా అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. నాలుగు మారేడు దళములు పట్టుకెళ్ళి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి.
పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకముల నన్నిటిని క్షోభింపజేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపమును పొందింది. భయంకరమయిన యుద్ధం చేసిన తరువాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపూవు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడూ పువ్వుచుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు. ఆవిడ భ్రమరాంబికా దేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు. పైన శక్తి రూపంతో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆనాదం వినపడుతూ ఉంటుంది. ఈ నాదమును ఆలిండియా రేడియో హైదరాబాద్, కర్నూల్, విజయవాడ స్టేషన్లు రికార్డుచేశాయి. శ్రీశైలం వెళ్లి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనపడుతుంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని “అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరీ” అని సౌందర్యలహరి లోని నాలుగు శ్లోకములు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది.
శ్రీశైలంలో ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. కృష్ణా నది శ్రీశైల పర్వతశిఖరమును పామువలె చుట్టుకొని ప్రవహిస్తుంది. శివుడిని విడిచి పెట్టలేక భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షినమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దానిని ‘పాతాళ గంగ అని పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్య వాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగములు అయిదు ఉంటాయి. దేవాలయంలో తూర్పున కృష్ణ దేవరాయలు నిర్మించిన గోపురం దక్షిణమున హరిహర రాయలవారు నిర్మించిన గోపురములు కనపడతాయి. ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి – ఈ మూడూ కలిసి పెరిగిన చెట్టు. ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు బ్రతికింది. అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు/ ఆ వెనుక రాజరాజేశ్వరీ దేవాలయం. సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి. ఉత్తరమున శివాజీ గోపురం, కళ్యాణమంటపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామీ నెమలితో ఉంటారు.
శివాజీ మహారాజు అక్కడికి వెళ్లి అమ్మవారి ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద యిప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ‘ఈ చంద్రహాసమును చేత పట్టుకో నీకు ఎదురు లేదు’ అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహూకరించింది. ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యమును స్థాపించాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం.
No comments:
Post a Comment