Wednesday, August 14, 2019

The story of Varalaxmi Vartakalpam వరలక్ష్మీ వ్రత కథ

 The story of Varalaxmi Vartakalpam

వరలక్ష్మీ వ్రత కథ

Image result for వరలక్ష్మీ


సూత పౌరాణికుండు శౌనకుడు మొదలగు మహర్షులను జూచి యిట్లనియె – మునివర్యులారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు గలుగునట్టి యొక వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి జెప్పె దానిం చెప్పెద వినుండు, కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిమయ ఖచితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చుండి యుండ పార్వతి పరమేశ్వరునకు నమస్కరించి దేవా! లోకమున స్త్రీలు యే వ్రతం బొనర్చిన సర్వ సౌభాగ్యంబులు, పుత్ర పౌత్రాదులం గలిగి సుఖంబుగ నుందురో అట్టి వ్రతం నా కానతీయవలయు” ననిన పరమేశ్వరుండిట్లనియె. ఓ మనోహరీ! స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు గలుగంజేయం వరలక్ష్మీ వ్రతంబను నొక వ్రతంబు గలదు.

ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగ వచ్చెడి శుక్రవారము నాడు జేయవలయుననిన పార్వతీదేవి యిట్లనియె. ఓ లోకారాధ్యా! నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతంబు నెట్లు చేయవలెను? ఆ వ్రతంబునకు విధియేమి? ఏ దేవతను పూజింపవలయును? పూర్వం బెవ్వరిచే నీ వ్రతంబాచరింపబడియె? దీనినెల్ల వివరంబుగా వివరింపవలయునని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రతమును సవిస్తరముగ జెప్పెద వినుము. మగధ దేశంబున కుండినంబను నొక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారముల తోడను, బంగారు గోడలు గల యిండ్లతోనూ గూడియుండెను. అట్టి పట్టణము నందు చారుమతి యనునొక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి భర్తను దేవునితో సమానముగ దలచి ప్రతి దినంబును ఉదయంబున మేల్కాంచి స్నానంబుచేసి పుష్పంబులచే భర్తకు పూజచేసి పిదప అత్తమామలకు ననేక విధంబులైన యుపచారంబులను చేసియు ఇంటి పనులను జేసికొని మితముగా ప్రియముగాను భాషించుచుండెను.
ఇట్లుండ అమ్మహా పతివ్రతయందు వరలక్ష్మికి అనుగ్రహము గలిగి యొకనాడు స్వప్నంబున ప్రసన్నమై “ఓ చారుమతీ, నేను వరలక్ష్మీ దేవిని. నీయందు నాకు అనుగ్రహము గలిగి ప్రత్యక్షమైతిని. –శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారమునాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులు నిచ్చెదనని వచించిన చారుమతీ దేవి స్వప్నములోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ‘నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే!
శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణు వక్షస్థలాలయే!! అని అనేక విధంబుల స్తోత్రము చేసి ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగెనేని జనులు ధన్యులుగను, విద్వాంసులుగను సకల సంపన్నులు గను నయ్యెదరు. నేను జన్మాంతరంబున జేసిన పుణ్య విశేషమున మీ పాదదర్శనము నాకు గలిగినదని జెప్పిన వరలక్ష్మీ సంతోషంబు జెంది, చారుమతికి ననేక వరములిచ్చి యంతర్థానంబు నొంద చారుమతి తక్షణంబున నిదుర మేల్కొని యింటికి నాలుగు ప్రక్కలం జూచి వరలక్ష్మీ దేవిని గానక ఓహో! మనము కలగంటిమని స్వప్న వృత్తాంతము భర్తకు మామగారికి మొదలయిన వాండ్రతో జెప్పగా వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమయినదని శ్రావణ మాసంబు వచ్చినతోడనే వరలక్ష్మీ వ్రతం బావశ్యంబుగ జేయవలసిందని జెప్పిరి. చారుమతి స్వప్నంబు విన్న స్త్రీలును శ్రావణమాసం ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చెడి శుక్రవారము వచ్చెను. అంత చారుమతియు మొదలగు స్త్రీలందరును ఈ దినంబే గదా వరలక్ష్మీ దేవి చెప్పిన దినంబని యుదయంబుననే మేల్కాంచి స్నానాదుల జేసి చిత్ర వస్త్రంబులను గట్టుకొని చారుమతీదేవి గృహంబున నొక ప్రదేశమునందు గోమయంబుచే నలికి మంటపం బేర్పరచి యందొక ఆసనంబువైచి దానిపై కొత్తబియ్యం బోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచపల్లవంబులచేత కలశంబేర్పరచి యందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలంబున “పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే! నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవసర్వదా!!” అను శ్లోకముచే ధ్యానావాహనాది షోడశోపచార పూజలం చేసి తొమ్మిది సూత్రములు గల తోరంబును దక్షిణహస్తమునకు గట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన జేసి ప్రదక్షిణము జేసిరి. ఇట్లొక ప్రదక్షిణము జేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు ఘల్లుఘల్లుమను నొక శబ్దము కలిగెను. అంత కాళ్ళకు జూచుకొనిన గజ్జెలు మొదలగు నాభరణములు కలిగియుండ చారుమతి మొదలగు స్త్రీలందరునూ ఓహో! వరలక్ష్మీదేవి కటాక్షం వలన గల్గినవని పరమానందంబు నొంది మరియొక్క ప్రదక్షిణంబు జేయగా హస్తములందు దగద్ధగాయమానంబుగా మెరయుచుండ నవరత్న ఖచితంబులైన నాభరణములుండుట గనిరి. ఇంక చెప్పనేల మూడవ ప్రదక్షిణంబు గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు నా స్త్రీల గృహంబులెల్ల స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనములతో నిండియుండెను. అంత నా స్త్రీలను దోడ్కొని గృహంబులకు పోవుటకు వారి వారి యిండ్లనుండి గుర్రములు, ఏనుగులు, రథములు బండ్లును నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించి స్థలమునకు వచ్చి నిలిచియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్తప్రకారముగా పూజచేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి పండ్రెండు కుడుములు వాయన దానం ఇచ్చి దక్షిణ తాంబూలము లొసంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే నాశీర్వాదంబు నొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసి భక్ష్యాదులను బంధువులతో నెల్లరను భుజించి తమకొరకు వచ్చి కాచుకొని యుండు వాహనములపై యిండ్లకు బోవుచు ఒకరితో నొకరు ఓహో! చారుమతీదేవి భాగ్యంబేమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతట స్వప్నములోకి వచ్చి ప్రత్యక్షం బాయెను. ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్యం, సంపత్తులు గలిగెనని చారుమతీ దేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ యిండ్లకు బోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరంబును నీ వ్రతంబును చేయుచు పుత్రపౌత్రాభివృద్ధి గలిగి, ధనకనక వస్తు వాహనములతోడ గూడుకొని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతీ! యీ యుత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యంబులను గలిగి సుఖంబుగ నుందురు. ఈ కథను వినువారలకును, చదువు వారలకును వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును.

 The story of Varalaxmi Vartakalpam

వరలక్ష్మీ వ్రత కథ 

Image result for వరలక్ష్మీ వ్రత కథ

No comments:

Post a Comment