Thursday, April 6, 2017

Manjunatha Sannidi మంజునాథ సన్నిధి ధర్మస్థలం


Manjunatha Sannidi


మంజునాథ సన్నిధి ధర్మస్థలం


శివుడు లీలామయుడు. సర్వాంతర్యామి. ఆయన లీలలు అనంతం. అనన్య సామాన్యం. శివుని లీలావిశేషాలతో పునీతమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ‘్ధర్మస్థల’ ఒకటి. దేశంలోని అతి పురాతన శైవధామంగా, శివుని సుందర క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ‘బెల్తంగడి’ తాలూకాలో వుంది. బెంగళూరు నగరానికి సుమారు 350 కిలోమీటర్లు దూరంలోఉన్న ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తూ మహేశ్వరుడు శ్రీ మంజునాథ స్వామిగా పూజలందుకుంటున్నాడు.

విశాలమైన వన సంపద, మది పులకించిపోయే ప్రకృతి అందాలు ఈ క్షేత్రం సొంతం. ఇక్కడకు వెళ్ళే భక్తులకు ఓ సుందరవనంలో విహరించామన్న అనుభూతి కల్గుతుంది. శివుని లీలావిశేషాలతో పునీతమవుతున్న ధర్మస్థల దివ్యక్షేత్రం ‘నేత్రావతి’ నదీమతల్లి ఒడ్డున అలరారుతోంది. ప్రకృతి అందాలకు వేదికగా భాసిల్లుతున్న నేత్రావతి నదీమతల్లి భక్తులకు, పర్యాటకులకు కావలసినంత మానసికానందాన్ని, ఆధ్యాత్మికానందాన్ని సొంతం చేస్తాయి. ఈ ఆలయానికి వచ్చే భక్తులంతా ముందుగా ‘నేత్రావతి’నదిలో పుణ్యస్నానాలు చేస్తారు. నదీస్నానం వల్ల పాపాలన్నీ పోయి సమస్త సుఖ సంతోషాలు సొంతమవుతాయ.

మంజునాథస్వామి ఆలయ ప్రాంగణం చూపరులను దృష్టిమరల్చనీయదు. ఈ ఆలయం కేరళ సంప్రదాయ రీతిలో ఉంటుంది. ఆలయానికి సంబంధించిన గోపురాదులు ఏవీ భక్తులకు కనిపించవు. ప్రధానాలయం ఆలయానికి ముందుభాగంలో పెద్దదిగా ఉన్న గంట భక్తులను ఆకట్టుకొంటుంది. అలనాటి కాలం నాటిదిగా దీనిని చెబుతారు. ప్రధానాలయమంతా భక్తులతో కిటకిటలాడుతుంది. గర్భాలయ మండపం పైన మధ్యభాగంలో పరమేశ్వరుని మూర్తి ఉంది. శ్రీ మంజునాథస్వామి ఆలయం కొన్ని ఆలయాల సమూహం, స్వామివారి ఆలయానికి ఎడమవైపు భాగంలో విఘ్ననాయకుడి మందిరం ఉంది. దీనికి సమీపంలోనే ‘అణ్ణప్పస్వామి’ ఆలయముంది. శ్రీ మంజునాథస్వామికి అచంచల భక్తుడు ‘అణ్ణప్ప’. ఈ కారణంగా స్వామివారి గర్భాలయానికి సమీపంలోనే అణ్ణప్పస్వామివారి ఆలయం నిర్మించారు. శ్రీ మంజునాథ స్వామివారి గర్భాలయం నిత్యనూతనంగా, తేజోవిరాజమానమవుతుంది. సమస్త ఆభరణాయుక్తుడైన మంజునాథ స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. స్వామి ఆలయానికి సమీపంలో ‘అమ్మనవరు’ ఆలయముంది. ‘అమ్మనవరు’ దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. స్ర్తిలు సౌభాగ్యసిద్ధికోసం, సంతానం కోసం ‘అమ్మనవరు’ను దర్శించుకుని భక్తితో పూజిస్తారు.

పురాణగాథ: ధర్మస్థల క్షేత్రానికి సంబంధించి పురాణగాథ ఒకటి ప్రచారంలో వుంది. సుమారు ఐదువందల సంవత్సరాల క్రితం నెల్యాదివీడులో అమ్మాదేవి బళ్ళారి, బ్రహ్మన్న ప్రెగ్గడెలనే పుణ్యదంపతులుండేవారు. ఆ దంపతులిద్దరూ అత్యంత దయామయులు. ధర్మాన్ని కాపాడుతూ, ధర్మపరిరక్షణ కోసం నిత్యం తపనపడుతూ వుండేవారు. ఒకసారి ధర్మదేవతలు మానవ రూపం ధరించి ‘నెల్యాదివీడు’ను తమకిచ్చి, సమీపాన ఒక గృహాన్ని నిర్మించి అందులో నివసించమని, అలాచేస్తే వారి ఐశ్వర్యం పదింతలవుతుందని చెప్పి అదృశ్యమయ్యారుట, ధర్మదేవతల అభీష్టంమేరకు ఆ దంపతులు అలాగే చేశారట. అనంతరం ధర్మదేవతలు ఆ దంపతులకు స్వప్నంలో కనిపించి తాము ‘కాలరాహు’, ‘కాలర్కై’, ‘కుమారస్వామి’, ‘కన్యాకుమారి’అనే ధర్మదేవతలమని, తమకు గుడులను కట్టించి ధర్మాన్ని కాపాడమని కోరారట. అయితే ధర్మదేవతలతోపాటు ఇతర దైవాలను కూడా పూజించనిదే ఫలసిద్ధి కల్గదని భావించి, ఆ దంపతులు ధర్మదేవతల అభీష్టంమేరకు ‘కదిరి’నుంచి మంజునాథ స్వామి లింగాన్ని తెప్పించి, ప్రతిష్ఠించారట.

ఆనాటినుంచి ఆ దంపతులు మంజునాథస్వామిని, ఇతర దేవతలను భక్తిశ్రద్ధలతో పూజించారు. ‘మంజుల’అంటే అభిరామం లేదా అందమని అర్థం. నాథుడనగా అధిపతి దేవుడు. అంటే మంజునాథుడంటే మంజుదైవతమని అర్థం. మంజునాథస్వామి పేరు బోధిసత్వ మంజునాథుని నుంచి ఏర్పడి ఉండవచ్చని, అతడు జైన, హిందువుల నమూనాలో ఉన్న దేవుడంటారు. ధర్మస్థల శ్రీ మంజునాథస్వామి ఆలయం నిత్యం వేలాదిమంది భక్తులతో సందడిగా ఉంటుంది. నిత్యం స్వామి నామస్మరణంతో మారుమోగుతున్న ఈ దివ్యాలయంలోకి ప్రవేశించే పురుషులు శరీరంపై పైవస్త్రాలు ధరించాలి.

ఆలయానికి వచ్చే భక్తులందరికీ అన్నదానం చేస్తారు. దీన్ని శ్రీ మంజునాథస్వామి ప్రసాదంగా భావించి భక్తితో స్వీకరిస్తారు. అపురూపశిల్ప సమన్విత స్తంభాలు, ప్రాకారాలతో ఈ ఆలయం అలరారుతోంది. ఆలయానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో గోమఠేశ్వరస్వామి ఆలయం ఉంది. ప్రకృతి అందాలు, విరబూసిన వనాలు, కొండలు ఈ ఆలయానికి ఆభరణాలుగా భాసిల్లుతాయ. ఈ ఆలయ ప్రాంగణంలో గోమఠేశ్వరస్వామి (బాహుబలుని) విగ్రహం ఉంది.

ఈ విగ్రహం 39 అడుగుల ఎత్తులో ఏకశిలగా దర్శనమిస్తుంది. ధర్మస్థల శ్రీ మంజునాథస్వామి క్షేత్రంలో ఏటా లక్ష దీపోత్సవాన్ని అత్యంత ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఏటా కార్తీక బహుళ దశమి మొదలుకుని అమావాస్యవరకూ ఐదు రోజులపాటు లక్ష దీపోత్సవాన్ని నిర్వహిస్తారు.

No comments:

Post a Comment