కోనసీమకు ఆ పేరు రావడానికి కారణమేమిటంటే.
.........................................ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ అందమైన ప్రాంతం, ఆహ్లాదకరమైన ప్రదేశము, అతిథి మర్యాదలకు అప్యాతలకు మారుపేరు.గౌతమి వశిష్ఠనదుల మధ్యగల చివరి భూభాగానికే కోనసీమ అని పేరు.కోణమనగా మూల, అంచు, చివరి భాగమనిపేరు.గౌతమీ,వశిష్ఠనదుల అంచున ఈ ప్రదేశమున్నందువలన కోణసీమగా ప్రసిద్ధి చెందింది. కోణ అనే పదం ప్రజల నోళ్ళలో నాని అర్థవిపరిణామం చెంది కోనసీమ అయింది.
గోదావరి ప్రాంతములో సముద్రతీర ప్రాంతానికి కడలునాడు అనే పేరుండేది. కడలునాడు (కడలి) అంటే సముద్రతీర ప్రాంతమని అర్ధము పూర్వం పరిపాలనా విభాగాలకు, రాజ్యమని, విషయ, సీమ, నాడులని పేర్లుండేవి.
కోనసీమ శాసనాలలో సింధు యుగ్మాంతర దేశమనే వ్యవహారంలో
వుండేది. యుగ్మాంతర దేశమనగా గౌతమి - వశిష్ఠ నదుల మధ్య ప్రాంతము.
మల్లిదేవుని పీఠాపుర శాసనములో
ముమ్మడి భీముని కుమారుడైన రాజపరేండు కోనమండలాధీశుడని చెప్పబడింది. ఆ శాసనపాఠం కింది విధంగా వుంది.
" శ్రీమా౯ రాజపటేండు ఖాఠ్మానాథః కోనమండలాధీశ ఉపయేమేయః కులజే లక్ష్మీతొండాంబికేదేవ్యౌ"
పైన పేర్కొన్న రాజపరేని కుమారుడైన రాజేంద్రచోడుని ద్రాక్షారామ శాసనాలలో ఒకదానిలో శ్రీరామేశ్వదేవుడికి ఏలవియ, నడుంబూడి, ముక్రోమల గ్రామాలను దానంగా ఇవ్వడం జరిగింది. ఏలవియ గ్రామం నేటి ఏలవేల, నడుంబూడి నేటి నడుపూడి, ముక్రోమల గ్రామానికి గల నేటి పేరు ముక్కామల.
అనవేమా రెడ్డి నడుపూరుశాసనములో...
"శాకాద్దే రసరత్న ఖాను గణితే గ్రస్తేవిధో రాహుణాకార్తి క్యాం విజయేశ్వ రస్యపురతః శ్రీ గౌతమీ రోధసి విప్రేభ్యోః పరమన్న వేమనృపతిః శ్రీ వేమసాన్యాః స్వసుః పుణ్యార్థ నడుపూరు సంజ్ఞక మదాద్రామం సకోణస్థలే"
అని కోణస్థలములోని గౌతమీనది తీరములోని నడుపూరు గ్రామము దానము ఇచ్చినట్లుగా వ్రాయబడివుంది.
కాటయవేముని తొత్తరమూడి శాసనములో " కోనదేశే గ్రహారోయం భాతి మల్ల వరాభిదం | తీరేచ వృద్ధ గౌతమ్యాః పుణ్యో ముక్తిశ్వరాంతికే "
అని కోనదేశములోని మల్లవరము, ముక్తేశ్వరము గ్రామాలను పెర్కొనడం జరిగింది.
కోన భీమరాజు భార్యయైన పద్మావతీ వ్రాయించిన ద్రాక్షారామ శాసనములో ఆమె భీమేశ్వరదేవునికి "ఖుండెనపల్లి" గ్రామము దానము చేసినట్లు కలదు.
కోరుకొండ రాజ్యమునేలిన ముమ్మడి నాయకుడు ఉభయగోదావరీ మధ్యప్రాంతము నందలి కోన, పానార, కురవాట, చెంగర సీమల పాలకుడని అతని శ్రీరంగము, కోరుకొండ శాసనములలో ప్రశక్తి వుంది
కోనసీమకు సంబంధించిన శాసనాలలో ప్రాచీన గ్రామాలకు
నేటి గ్రామనామలేమిటో చూద్దాం.
(1) ఏలవియ - ఏలివెల
(2) నడుపుంబూడి - నడుపూడి
(3) ముక్రోమల - ముక్కామల
(4) నడుపూరు -నడుపూడి
(5) మల్లవరము -తొత్తరమూడి
(6) ముక్తీశ్వరము - ముక్తీశ్వరము ( మార్పులేదు)
(7) ఖుండెనపల్లి - గున్నేపల్లి
(8) తోత్తమూండి - తొత్తర మూడి.
No comments:
Post a Comment