Wednesday, July 31, 2024

Saraswathi Temple Basra జ్ఞాన సరస్వతీ ఆలయం – బాసర ...!!

 జ్ఞాన సరస్వతీ ఆలయం – బాసర ...!!



ఇది తెలంగాణ రాష్ట్రం లోని ఆదిలాబాదు జిల్లా, ముధోల్ మండలం బాసరలో ప్రఖ్యాతిచెందిన జ్ఞానసరస్వతి ఆలయం ఉంది.. ఈ ఆలయం నిర్మల్ పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరం. 


భారత దేశంలో గల రెండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇదే. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. 


ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. 

బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. 


ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము ఉంటుంది. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసము చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు.  


ఆలయ ప్రాంగణంలోని జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె వంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు.బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతోంది. 


కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. 


వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్ఠించాడు.  


వ్యాసుడు ఇక్కడ కొంత కాలము నివసించాడు కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి, వ్యాసర అనబడి, తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన ‘బాసర’ గా నామాంతరాన్ని సంతరించుకున్నది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. 


ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానం, జ్ఞానము లభిస్తుందని గాఢంగా విశ్వసిస్తారు. ఆది కవి వాల్మికి ఇక్కడ సరస్వతీ దేవిని ప్రతిష్ఠించి రామాయణం వ్రాసాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మికి మహర్షి సమాధి పాలరాతి శిల ఉన్నాయి. మంజీరా, గోదావరి తీరాన రాష్ట్రకూటుల చేత నిర్మించబడిన మూడు దేవాలయాలలో ఇది కూడా ఒకటి.


ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః

No comments:

Post a Comment