Tuesday, July 9, 2024

బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం

 బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం


బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం : హైదరాబాదులోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఆషాఢ బోనాల సందర్భంగానే మహోత్సవంగా నిర్వహిస్తారు. హైదరాబాదులోని బల్కంపేటలో రేణుక ఎల్లమ్మ భక్తజనుల ఆరాధనలందుకుంటోంది. ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయంలో ఎల్లమ్మ జలాధివాసిని, స్వయంవ్యక్తమైన తల్లి. అమ్మవారి ఆలయంలో క్షేత్రపాలకురాలిగా ఆరోగ్య ప్రదాయినియైన శీతలాదేవిని స్థాపించారు. జలాధివాసినిగా అమ్మవారు ఆవిర్భవించిన కారణంగా ఆమెను జలదుర్గా స్వరూపంగా ఆర్చిస్తారు. ప్రస్తుతం ఆలయం ఏర్పడి, అర్చామూర్తులు వెలసినా, మూలస్వరూపమైన అమ్మవారిని జలాధివాసినిగా దర్శించవచ్చు. క్షేత్రపాలకురాలు శీతలాదేవి (పోచమ్మ) కూడా ఆలయంలోనే దర్శనమిస్తుంది. కొత్త దంపతులు పసుపుబట్టలతో అమ్మవారిని దర్శించుకుంటే సంసారం ఏ కష్టాలు, చింతలు లేకుండా సాగుతుందని నమ్మకం. ఆలయంలో మూలమూర్తి శిరస్సు వెనుక భాగంలో ఉన్న బావి నుంచి వచ్చే ఊటనీటినే భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఈ నీటిని స్నానం చేసే నీళ్లలో కలుపుకుని స్నానం చేస్తే కలరా, మశూచి, గజ్జి, తామర వంటి వ్యాధులు సమసిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ నీటితో ఇళ్లను శుద్ధిచేసుకుంటే భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు పారిపోతాయని వారి నమ్మకం. ప్రతి ఏటా ఆషాఢమాసం మొదటి మంగళవారం నాడు ఎల్లమ్మతల్లి కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడురోజుల పాటు జరిగే ఈ కల్యాణోత్సవాలుంటాయి. ఎదుర్కోలు, కల్యాణం, రథోత్సవం అనే మూడు దశలుగా సాగే ఈ కార్యక్రమంలో రథోత్సవం నేత్రపర్వంగా సాగుతుంది.

No comments:

Post a Comment